
Trust & Safety
డీప్‌ఫేక్ వేషధారణలు: AI మోసాలతో జర జాగ్రత్త!
PhonePe Regional|3 min read|14 October, 2025
AI అనేది ఈ సంవత్సరం బాగా వినిపించిన పదం, దానికి ఉన్న కారణాలు కూడా సరైనవే. రోజువారీ కార్యకలాపాలు, ఆవిష్కరణల్లోనూ – అలానే సాంకేతికత నుండి వినోదం వరకు – AI వాడకంలో గణనీయమైన వృద్ధిని మనం చూస్తున్నాము. అయితే, కృత్రిమ మేధస్సు మరింత అభివృద్ధి చెందుతూ, మన అందరికీ ఎంత బాగా అందుబాటులోకి వచ్చిందో, దాని ప్రమాదాలు కూడా అంతే ఎక్కువగా మన జీవితంలోకి వస్తున్నాయి. సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులను దాదాపుగా పోలి ఉన్న AIతో జనరేట్ చేసిన ఫొటోలు, వీడియోలతో నేటి సోషల్ మీడియా నిండిపోయింది. వీటిలో ఏది నిజం, ఏది అబద్ధమో చెప్పడం చాలా కష్టం! అందుకే డీప్‌ఫేక్‌లతో ప్రజలను అనుకరించి, మోసగించడానికి మోసగాళ్లు ఇప్పుడు ఈ సాంకేతికతను దుర్వినియోగపరుస్తున్నారు.
డీప్‌ఫేక్‌తో మనుషులను అనుకరించడం (వేషధారణ) అంటే ఏమిటి?
డీప్‌ఫేక్ వేషధారణ అంటే ఎవరైనా మోసగాడు AI టెక్నాలజీతో వేరే వ్యక్తిగా నటిస్తూ, మీ నుండి డబ్బును తీసుకునేలా లేదా సున్నితమైన సమాచారాన్ని పొందేలా చేసే మోసం. మీ స్నేహితుడిగా, కుటుంబ సభ్యుడిగా లేదా కంపెనీ లేదా ప్రభుత్వ అధికారిగా నటిస్తూ మిమ్మల్ని బోల్తా కొట్టించడానికి ఆ మోసగాడు అలా చేయవచ్చు.
“డీప్ లెర్నింగ్ (లోతైన అధ్యయనం)”, “ఫేక్ (నకిలీ)” అనే పదాలను కలిపి, డీప్‌ఫేక్స్ అనే పదం పుట్టింది, ఈ నకిలీ వేషధారణలను జనరేటివ్ అడ్వర్సరియల్ నెట్‌వర్క్స్ (GANs) అనే AI టెక్నాలజీతో క్రియేట్ చేస్తారు, ఈ టెక్నాలజీ ఒక వ్యక్తి డేటాను నిశితంగా అధ్యయనం చేసి, ఆ వ్యక్తిని పోలి ఉండే, అంటే వాస్తవానికి అత్యంత దగ్గరగా ఉండే నకిలీ దృశ్యాలను జనరేట్ చేస్తుంది. స్కామర్లు ఈ టెక్నాలజీని అడ్డుపెట్టుకుని, మీరు కూడా సులభంగా నమ్మగలిగే, అసలు ఏది నిజమో, ఏది నకిలీనో గుర్తుపట్టలేని విధంగా ఆడియో మెసేజ్‌లు, వీడియోలను జనరేట్ చేస్తారు.
డీప్‌ఫేక్‌ను నకిలీ వేషధారణలకు ఎలా ఉపయోగిస్తారు?
డీప్‌ఫేక్ టెక్నాలజీ ఒక వ్యక్తి ముఖ కవళికలను, వాయిస్‌ను అనుకరిస్తుంది, నేరస్థులు ఒక వ్యక్తిని అడ్డుపెట్టుకుని హానికరమైన కార్యకలాపాలకు పాల్పడాలని అనుకుంటే, ఆ వ్యక్తికి చెందిన పూర్తి, కృత్రిమ కాపీని ఈ టెక్నాలజీ క్రియేట్ చేస్తుంది. మోసం చేయడానికి డీప్‌ఫేక్‌లను ఉపయోగించే కొన్ని మార్గాలను కింద వివరించాము:
- గుర్తింపు దొంగతనం: ముఖం లేదా వాయిస్ గుర్తింపుతో పని చేసే ఆన్‌లైన్ సెక్యూరిటీ ప్రోటోకాల్‌లను అధిగమించడానికి డీప్‌ఫేక్‌లను ఉపయోగించవచ్చు, అకౌంట్లను యాక్సెస్ చేయడానికి, లోన్లను పొందడానికి లేదా వేరొకరి పేరుతో క్రెడిట్ కార్డ్‌లను ఓపెన్ చేయడానికి నేరస్థులకు ఇవి వీలు కల్పిస్తాయి.
- ఆర్థిక మోసం: మీ ప్రియమైన వ్యక్తిలా నటిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామని నమ్మించి మిమ్మల్ని డబ్బు అడుగుతున్నట్లుగా మోసగించడానికి లేదా ఆన్‌లైన్‌లో వెంటనే డబ్బు బదిలీని డిమాండ్ చేస్తున్న అధికారిని అనుకరించడానికి స్కామర్లు డీప్‌ఫేక్‌ను ఉపయోగించవచ్చు. ఈ నకిలీ వేషధారణలు చాలా వాస్తవంగా కనిపిస్తాయి, నమ్మేలా ఉంటాయి కాబట్టి, అవి ప్రజలను మోసం చేయడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి.
- దోపిడీ, బ్లాక్‌మెయిల్: నేరస్థులు ఒక వ్యక్తికి చెందిన నకిలీ అసభ్యకర వీడియోలు లేదా ఫొటోలను క్రియేట్ చేసి డబ్బును దోచుకోవడానికి యత్నించవచ్చు లేదా ఆ వ్యక్తికి నచ్చని పని చేయమని బలవంతం చేయవచ్చు.
- తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం: డీప్‌ఫేక్‌లు ప్రముఖ వ్యక్తులను లేదా సామాన్యులను అనుకరించి, వారు ఎప్పుడూ చేయని పనులను చేశామని చెప్పినట్లుగా లేదా చేస్తున్నట్లుగా కనిపించేలా చిత్రీకరిస్తాయి. ఇది ప్రతిష్టకు నష్టం కలిగించడానికి, సామాజిక సంఘర్షణను రేకెత్తించడానికి లేదా మార్కెట్లను తప్పుదోవ పట్టించడానికి మోసగాళ్లకు ఉపయోగపడుతుంది.
డీప్‌ఫేక్‌ను ఎలా గుర్తించాలి?
డీప్‌ఫేక్‌లు దాదాపుగా ఖచ్చితమైనవిగానే అనిపించినప్పటికీ, మీరు కింద వివరించిన కీలక సంకేతాలను తరచుగా వెతికితే నకిలీలను గుర్తుపట్టవచ్చు:
- దృశ్య అసమానతలు: వీడియోలోని వ్యక్తి ఇబ్బందికరంగా రెప్పలు మూయడం, తెరవడం లేదా అసహజమైన ముఖ కవళికలు వంటి వింత కదలికలు ఉన్నాయేమో చూడండి. అలాగే, వ్యక్తి ముఖంపై పడుతున్న కాంతి, నీడలు వారి పరిసరాలతో మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేయండి.
- ఆడియో క్లూలు: వాయిస్‌ను శ్రద్ధగా వినండి. వాయిస్‌లో హెచ్చు, తగ్గులు లేకుండా, రోబో మాదిరిగా మాట్లాడుతూ లేదా వింతగా మధ్యమధ్యలో శబ్దం ఆగిపోతూ ఉండవచ్చు. వీడియోతో సౌండ్ మ్యాచ్ కాకపోవచ్చు, పలికే పదాలకు, వ్యక్తి పెదవుల కదలికలకు సంబంధం ఉండదు.
- అనుమానాస్పద అభ్యర్థనలు: అనూహ్యమైన అభ్యర్థనల పట్ల, ముఖ్యంగా డబ్బు లేదా వ్యక్తిగత సమాచారం అడిగే వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. స్కామర్లు తరచుగా మీరు వేగంగా నిర్ణయం తీసుకోవాలని మీపై ఒత్తిడి తీసుకురావడానికి తాము అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామన్న భావానను మాటలతో కలిగిస్తారు.
డీప్‌ఫేక్‌ల నుండి రక్షించుకోవడం ఎలా?
డీప్‌ఫేక్ టెక్నాలజీ నానాటికీ పెరుగుతున్న ముప్పు, కానీ మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అనేక చర్యలు తీసుకోవచ్చు.
- మల్టీ-ఫ్యాక్టర్ ప్రామాణీకరణను (MFA) ఉపయోగించండి: మీ అకౌంట్లకు ఎల్లప్పుడూ MFAని ఎనేబుల్ చేయండి. ఇది అవసరమైన భద్రతా దశలను యాడ్ చేస్తుంది, అంటే స్కామర్ బయోమెట్రిక్ స్కాన్‌ను ఛేదించినప్పటికీ, మీ అకౌంట్‌ను యాక్సెస్ చేయాలంటే వారికి రెండవ రకమైన వెరిఫికేషన్ అవసరమవుతుంది.
- అనుమానాస్పద అభ్యర్థనలను వెరిఫై చేయండి: ఒక స్నేహితుడు లేదా సహోద్యోగి ఎప్పుడూ లేనట్లుగా వీడియో కాల్ చేసి లేదా మెసేజ్ పంపి డబ్బు లేదా సమాచారం అడిగితే, ఫోన్ కాల్‌ను కట్ చేసి, మీ వద్ద ఉన్న వారి సొంత నంబర్‌కు కాల్ చేయండి, అలానే ఇతర, విశ్వసనీయ ఛానెల్ ద్వారా వారిని సంప్రదించండి.
- మీరు అవగాహన పెంచుకుంటూనే, ఇతరులకూ అవగాహన కల్పించండి: డీప్‌ఫేక్ హెచ్చరిక సంకేతాలను గుర్తించడం నేర్చుకోండి, అలానే వాటి గురించి మీ కుటుంబ సభ్యులు, సహోద్యోగులు కూడా తెలుసుకునేలా వారిని ప్రోత్సహించండి. “నమ్మండి, కానీ వెరిఫై చేయండి” అనే మనస్తత్వం కలిగి ఉండటమే ఈ స్కామ్‌ల నుండి మీకు లభించే ఉత్తమ రక్షణ.
ఎలా ఫిర్యాదు చేయాలి?
మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుని స్కామ్ జరిగిందనే అనుమానం మీకు కలిగితే, వెంటనే దాని గురించి సమాచారమివ్వండి:
PhonePeలో ఫిర్యాదు చేయడం:
- PhonePe యాప్: సహాయం విభాగానికి వెళ్లి, ఫిర్యాదు చేయండి.
- PhonePe కస్టమర్ కేర్: 80-68727374 / 022-68727374కు కాల్ చేయండి.
- సోషల్ మీడియాలో ఫిర్యాదు చేయడం:
- Twitter: PhonePe Support
- Facebook: PhonePe Official
- ఫిర్యాదుల పరిష్కారం: PhonePe ఫిర్యాదుల పరిష్కార పోర్టల్‌కు వెళ్లి ఫిర్యాదు నమోదు చేయండి.
అధికారులకు ఫిర్యాదు చేయడం:
- సైబర్ క్రైమ్ సెల్: సైబర్ క్రైమ్ పోర్టల్‌కు వెళ్లి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయండి లేదా 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి.
- టెలీకమ్యూనికేషన్స్ విభాగం (DOT): అనుమానాస్పద మెసేజ్‌లు, కాల్‌లు, లేదా వాట్సప్ మోసాల గురించి సంచార్ సాథీ పోర్టల్‌లోని ఛక్షు సౌకర్యం ద్వారా ఫిర్యాదు చేయండి.
ముఖ్యమైన రిమైండర్ — PhonePe ఎప్పుడూ మీ రహస్యమైన లేదా వ్యక్తిగత వివరాలను అడగదు. phonepe.com డొమైన్ నుండి కాకుండా, వేరే డొమైన్ నుండి వచ్చిన ఇమెయిల్స్‌లో తాము PhonePe నుండే మెయిల్ పంపించామని నమ్మబలికితే మీరు వాటిని అస్సలు పట్టించుకోవద్దు. మోసానికి పాల్పడుతున్నారనే అనుమానం మీకు వస్తే, దయచేసి అధికారులను వెంటనే సంప్రదించండి.