
Trust & Safety
ఆన్‌లైన్ షాపింగ్‌తో జాగ్రత్త!నకిలీ వెబ్‌సైట్లు, స్కామ్ యాడ్‌లను గుర్తించి, వాటికి ఇలా చెక్ పెట్టండి !
PhonePe Regional|3 min read|18 September, 2025
ఆన్‌లైన్ షాపింగ్‌తో వేర్వేరు వ్యక్తులు వేర్వేరు ప్రయోజనాలను పొందుతారు. ఇది కొందరికి థెరపీగా ఉపయోగపడుతుంది, అంటే బిజీగా ఉండే ఎగ్జిక్యూటివ్‌కు ఆఫ్‌లైన్ షాపింగ్‌కు ఉన్న చక్కని ప్రత్యామ్నాయం ఆన్‌లైన్ షాపింగ్, ఎందరో తల్లులు తమ పిల్లల స్కూల్ దుస్తుల నుండి వస్తువుల వరకూ అన్నీ ఆన్‌లైన్ లోనే కొంటారు, ఫ్రెండ్‌కు చివరి నిమిషంలో గిఫ్ట్ కొనాలన్నా, ఇలా చాలా సమస్యలకు ఆన్‌లైన్ షాపింగే పరిష్కారం. ఆన్‌లైన్ షాపింగ్ వల్ల మన కోసం, మనకు ప్రియమైన వారి కోసం ప్రోడక్ట్‌లను కొనుగోలు చేసే విధానం ఎంతో మారింది. అయితే దురదృష్టవశాత్తు, అందరూ మెచ్చే ఈ సౌకర్యం వెనుక ప్రమాదమూ పొంచి ఉంది – అదే ఆన్‌లైన్ షాపింగ్ మోసం.
సైబర్ నేరగాళ్లు నకిలీ ఆన్‌లైన్ స్టోర్‌లను క్రియేట్ చేసి, సోషల్ మీడియా ప్రకటనలతో యూజర్లను బురిడీ కొట్టిస్తారు, అసలు వారి వద్ద లేని ప్రోడక్ట్‌లను పొందడం కోసం యూజర్లు తమ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసేలా లేదా పేమెంట్లు చేసేలా మోసగిస్తారు. ఈ స్కామ్‌లు చాలా వరకూ, అంటే మోసపోయేంత వరకూ చాలా నమ్మకంగా కనిపిస్తాయి, చూసిన వెంటనే గుర్తుపట్టడం కష్టం.
ఆన్‌లైన్ షాపింగ్ మోసం వల్ల కేవలం కొన్ని వందల రూపాయలు లేదా వేల రూపాయలను పోగొట్టుకోవడమే కాదు, అనేక దీర్ఘకాలిక దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి:
- ఆర్థిక నష్టం: ఒకసారి డబ్బు బదిలీ అయిన తర్వాత, దాన్ని రికవరీ చేయడం దాదాపుగా అసాధ్యం.
- డేటా దొంగతనం: స్కామ్ వెబ్‌సైట్లు మీ క్రెడిట్ కార్డ్ సమాచారంతో సహా మీ వ్యక్తిగత వివరాలను దుర్వినియోగించవచ్చు.
- బ్రాండ్ ఇమేజ్: ఒకసారి మోసపోయిన బాధితులు, తరచుగా వాస్తవమైన లావాదేవీలకు కూడా అదే బ్రాండ్/పేమెంట్ గేట్‌వేను ఉపయోగించడానికి వెనుకాడతారు.
ప్రజల నమ్మకాన్ని, తాపత్రయాన్ని, సరసమైన డీల్స్‌ను వెంటనే పొందాలన్న వారి కోరకను మోసగాళ్లు ఎరగా వాడుకుంటారు. ఈ స్కామ్‌లు ఎలా జరుగుతాయో, వాటి నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు జరిగే విధానం
1. సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు
మోసగాళ్లు సోషల్ మీడియాలో డూప్లికేట్ లేదా నకిలీ ప్రొఫైళ్లను క్రియేట్ చేస్తారు. వారు సాధారణంగా:
- ప్రసిద్ధ విక్రేతలు లేదా బ్రాండ్‌లుగా నటిస్తారు.
- నమ్మశక్యం కాని “ప్రత్యేకమైన” డిస్కౌంట్లను అందిస్తారు.
- దొంగిలించిన ప్రోడక్ట్ ఫోటోలు, నకిలీ టెస్టిమోనియల్స్‌ను ఉపయోగిస్తారు.
- ముందస్తు పేమెంట్ల కోసం ఒత్తిడి చేస్తారు, UPI లేదా బ్యాంక్ ద్వారా చెల్లించమని పట్టుబడతారు, పేమెంట్ అయ్యాక కనిపించకుండా పోతారు.
ఉదాహరణకు, ఒక నకిలీ సోషల్ మీడియా పేజీలో ప్రముఖ బ్రాండ్ల ధరలో సగం ధరకే ట్రెండీ దుస్తుల ఆఫర్ ఉందనే యాడ్ కనిపించవచ్చు. కానీ పేమెంట్ చేసిన తర్వాత, కొనుగోలుదారున్ని ఆ అకౌంట్ బ్లాక్ చేస్తుంది లేదా రాత్రికి రాత్రే ప్లేట్ ఫిరాయిస్తుంది.
2. మోసపూరిత ఆన్‌లైన్ వెబ్‌సైట్లు
అథెంటిక్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లను పోలి ఉండేలా క్రియేట్ చేసినవే నకిలీ వెబ్‌సైట్లు. వాటిలో కింది అంశాలు ఉండవచ్చు:
- ఒరిజినల్ వెబ్‌సైట్లతో దాదాపుగా మ్యాచ్ అయ్యే డొమైన్ పేర్లను ఉపయోగిస్తారు (ఉదా: xyz.in బదులుగా xYz.in వంటి డొమైన్ క్రియేట్ చేస్తారు).
- కొనుగోలుదారులను ఆకర్షించడానికి నమ్మశక్యం కాని చౌకైన డీల్స్‌ను అందిస్తారు.
- సురక్షితం కాని పేమెంట్ గేట్‌వేలతో మీ బ్యాంక్ వివరాలను ప్రమాదంలో పడవేస్తారు.
- నకిలీ ప్రోడక్ట్‌లను డెలివరీ చేస్తారు, లేదా అసలు వేటినీ డెలివరీ చేయరు.
ఈ వెబ్‌సైట్లు వెబ్‌సైట్ అథెంటిసిటీ, రిటర్న్ పాలసీలు లేదా కాంటాక్ట్ వివరాలు వంటి సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేయని కొనుగోలుదారులపైనే ఆధారపడతాయి.
జాగ్రత్త పడాల్సిన ప్రమాదకర హెచ్చరికలు
సాధారణ హెచ్చరిక సంకేతాల గురించి తెలుసుకోవడం వల్ల ఆన్‌లైన్ షాపింగ్ మోసాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. కొన్ని హెచ్చరిక సంకేతాలను కింద పేర్కొన్నాము:
- నమ్మశక్యం కాని డిస్కౌంట్లు: నమ్మశక్యం కాని డీల్స్‌లా అనిపిస్తే జాగ్రత్త పడండి, అవి సాధారణంగా ఇలానే ఉంటాయి.
- క్యాష్ ఆన్ డెలివరీ (COD) ఉండదు: స్కామర్లు తరచుగా ముందస్తు పేమెంట్లకే పట్టుబడతారు.
- అనుమానాస్పద వెబ్‌సైట్ డిజైన్: పేలవమైన వ్యాకరణం, అస్పష్టమైన ఫోటోలు లేదా బ్రేక్ అయిన లింక్‌లు వంటివి ప్రధాన హెచ్చరికలు.
- వెరిఫై చేయని సోషల్ మీడియా హ్యాండిల్స్: బ్లూ టిక్‌లు లేదా వాస్తవ ఫాలోవర్ల సంఖ్యను చెక్ చేయండి.
- కస్టమర్ సహాయ విభాగం ఉండదు: చట్టబద్ధమైన వ్యాపారాలు స్పష్టమైన రిటర్న్/ఎక్స్‌ఛేంజ్ పాలసీలను, అలానే ప్రతిస్పందించే కస్టమర్ సర్వీస్‌ను అందిస్తాయి.
మిమ్మల్ని మీరు రక్షించుకునే పద్ధతి
మోసగాళ్లు రోజురోజుకీ అప్‌డేట్ అవుతున్నప్పటికీ, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తీసుకోగల అనేక చర్యలు ఉన్నాయి:
- కొనుగోలు చేసే ముందు వెరిఫై చేయండి: విక్రేత లేదా వెబ్‌సైట్ గురించి ఎల్లప్పుడూ రీసెర్చ్ చేయండి. వెంటనే Googleలో సమీక్షలను సెర్చ్ చేస్తే స్కామ్‌లు బయటపడొచ్చు.
- వెబ్‌సైట్ భద్రతను చెక్ చేయండి: పేమెంట్ వివరాలను ఎంటర్ చేసే ముందు URLలో https://, ప్యాడ్‌లాక్ గుర్తు ఉన్నాయో లేవో చూడండి.
- విశ్వసనీయమైన ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించండి: ఇదివరకే మంచి పేరు సంపాదించిన ప్రసిద్ధ ఇ-కామర్స్ యాప్‌లు, వెబ్‌సైట్లనే వాడండి.
- సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండండి: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మీరు చూసే ప్రతి పేజీ లేదా ప్రకటనను నమ్మవద్దు. అకౌంట్ ప్రామాణికతని వెరిఫై చేయండి.
- అనుమానాస్పద యాక్టివిటీల గురించి రిపోర్ట్ చేయండి: నకిలీ పేజీలను సంబంధిత ఒరిజినల్ డొమైన్లకు రిపోర్ట్ చేయండి, ప్రభుత్వ సైబర్‌క్రైమ్ పోర్టల్‌లో సైబర్ ఫిర్యాదును నమోదు చేయండి.
నమ్మదగిన బిజినెస్‌లు పారదర్శకతకు పెద్ద పీట వేస్తాయని గుర్తుంచుకోండి, అవి భద్రతతో కూడిన పేమెంట్ ఆప్షన్లను అందిస్తాయి, వెంటనే పేమెంట్లు చేయమని మీపై ఒత్తిడి తీసుకురావు.
ఇకపై సోషల్ మీడియాలో నమ్మశక్యం కాని డీల్స్ చూసినా లేదా మీరు ఇంతకు ముందు ఎప్పుడూ వినని వెబ్‌సైట్ మీకు కనిపించినా – అక్కడే ఆగిపోండి, వెరిఫై చేయండి, ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే “ఇప్పుడే కొనండి”ని నొక్కండి.
PhonePeలో స్కామ్ గురించి ఎలా రిపోర్ట్ చేయాలి
PhonePeలో స్కామర్లు మిమ్మల్ని టార్గెట్ చేస్తే, కింది దశలను అనుసరించి ఫిర్యాదు చేయండి:
1. PhonePe యాప్: సహాయం విభాగానికి వెళ్లి, “లావాదేవీతో సమస్య ఉంది” ఆప్షన్ కింద సమస్యను తెలపండి.
2. PhonePe కస్టమర్ కేర్ నంబర్: మీరు 80–68727374 / 022–68727374కు కాల్ చేసి PhonePe కస్టమర్ కేర్‌ను సంప్రదించి, ఫిర్యాదు చేయవచ్చు, ఆ తర్వాత కస్టమర్ కేర్ ఏజెంట్ టికెట్‌ను రెయిజ్ చేసి, ఆ సమస్య విషయంలో మీకు సహాయం అందిస్తారు.
3. సోషల్ మీడియా: మీరు కింది హ్యాండిల్స్‌కు వెళ్లి కూడా మోసం గురించి ఫిర్యాదు చేయవచ్చు
Twitter — https://twitter.com/PhonePeSupport
Facebook — https://www.facebook.com/OfficialPhonePe
4. ఫిర్యాదుల పరిష్కారం (గ్రీవెన్స్): గతంలో ఇచ్చిన ఫిర్యాదుకు పరిష్కారం పొందడం కోసం, మీరు: https://grievance.phonepe.com/కు లాగిన్ అయ్యి, సంబంధిత ఫిర్యాదు టికెట్ ఐడిని షేర్ చేయండి.
5. సైబర్ సెల్: చివరగా, మీకు సమీపంలో ఉన్న సైబర్ క్రైమ్ సెల్‌కు వెళ్లి మోసం గురించి ఫిర్యాదు చేయవచ్చు లేదా https://www.cybercrime.gov.in/కు వెళ్లి ఆన్‌లైన్‌లో లేదా 1930కు కాల్ చేసి సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు.
ముఖ్యమైన రిమైండర్ — PhonePe ఎప్పుడూ మీ రహస్యమైన లేదా వ్యక్తిగత వివరాలను అడగదు. phonepe.com డొమైన్ నుండి కాకుండా, వేరే డొమైన్ నుండి వచ్చిన ఇమెయిల్స్‌లో తాము PhonePe నుండే మెయిల్ పంపించామని నమ్మబలికితే మీరు వాటిని అస్సలు పట్టించుకోవద్దు. మోసానికి పాల్పడుతున్నారనే అనుమానం మీకు వస్తే, దయచేసి అధికారులను వెంటనే సంప్రదించండి.