PhonePe Blogs Main Featured Image

Trust & Safety

క్యాష్ ఆన్ డెలివరీ (COD) స్కామ్: అప్రమత్తంగా ఉంటూ సురక్షితంగా షాపింగ్ చేయడం ఎలా

momitajaiswal3|4 min read|18 November, 2026

URL copied to clipboard

కరోనా కాలం తర్వాత ఇ-కామర్స్ రంగం వేగంగా విస్తరించడంతో, నిజమైన వ్యాపారాలతో పాటు ఆన్‌లైన్ మోసాలు కూడా గణనీయంగా పెరిగాయి. ఆన్‌లైన్ లావాదేవీల పట్ల సందేహాలు ఉన్నవారికి ‘క్యాష్ ఆన్ డెలివరీ’ (COD) అనేది ఒక సౌకర్యవంతమైన పేమెంట్ ఆప్షన్‌గా ఎంతో ఆదరణ పొందింది. అయితే, అమాయక వినియోగదారులను మోసం చేయడానికి ఎదురుచూస్తున్న సైబర్ నేరగాళ్లను కూడా ఈ విధానం ఆకర్షిస్తోంది. తమ అవసరాల కోసం ఎక్కువ మంది ఆన్‌లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో, ఈ పేమెంట్ పద్ధతిలో ఉండే లోపాల పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం.

దీని అసలు అర్థం ఏమిటంటే:

డెలివరీలు మరియు క్యాష్ ఆన్ డెలివరీ (COD) ఆర్డర్లు పూర్తిగా మనుషుల మధ్య ఉండే ప్రాథమిక నమ్మకంపై ఆధారపడి పనిచేస్తాయి, సరిగ్గా అందుకే మోసగాళ్లు వీటిని లక్ష్యంగా చేసుకుంటారు.

అధికారిక కొరియర్ ఏజెంట్లలా నటిస్తూ లేదా నకిలీ కంపెనీ బ్రాండింగ్‌ను ఉపయోగిస్తూ, మోసగాళ్లు మీతో తక్షణమే పేమెంట్ చేయించడానికి లేదా మీ సున్నితమైన అకౌంట్ వివరాలను రాబట్టడానికి ఏదో ఒక అత్యవసర కారణాన్ని సృష్టిస్తారు. మీ ఇంటి గుమ్మం వద్ద హడావిడి వాతావరణాన్ని సృష్టించి, ఒక సాధారణ డెలివరీలా కనిపించే తీరుతో కలిపినప్పుడు, డిజిటల్ పేమెంట్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే వినియోగదారులు కూడా ఏమరుపాటుకు గురయ్యే ప్రమాదం ఉంది.

COD మోసాలు ఎలా జరుగుతాయి?

ఇదంతా సాధారణ మానవ మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది. మోసగాళ్లు సోషల్ ఇంజనీరింగ్ ద్వారా కృత్రిమ అత్యవసర పరిస్థితిని సృష్టిస్తారు. ఇలా ఒక విధమైన హడావిడిని కల్పించడం ద్వారా, వివరాలు సరిచూసుకోవడానికి ఆలస్యం చేస్తే భారీ నష్టం జరుగుతుందని ప్రజలను నమ్మిస్తారు. ఒక మంచి ఆఫర్ చేజారిపోతుందనో లేదా రావాల్సిన పార్శిల్ వెనక్కి వెళ్ళిపోతుందనో భయపెట్టి, ఆ ఆందోళనను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఆ కంగారులో పడి, చాలామంది సాధారణంగా పాటించే కనీస భద్రతా తనిఖీలను కూడా మరచిపోతారు.

నేడు మోసగాళ్లు ఉపయోగిస్తున్న కొన్ని సాధారణ డెలివరీ మరియు పేమెంట్ ఉచ్చులు ఇక్కడ ఉన్నాయి:

1. నకిలీ COD ఆర్డర్లు మరియు కుమ్మక్కైన కొరియర్లు

ఒక మోసగాడు మీరు ఆర్డర్ చేయని “క్యాష్ ఆన్ డెలివరీ” ప్యాకేజీని మీ ఇంటికి పంపుతాడు. ముందుగా డబ్బు చెల్లిస్తే తప్ప ఆ పార్శిల్‌ను తెరవడానికి లేదా పరిశీలించడానికి కొరియర్ ఏజెంట్ ఒప్పుకోడు, పైగా అధికారిక బ్రాండింగ్ ముద్రించిన ఒక QR కోడ్‌ను మీకు చూపిస్తాడు. మీరు దాన్ని స్కాన్ చేసి పేమెంట్ చేసిన మరుక్షణమే, మీ డబ్బు నేరుగా మోసగాడి వ్యక్తిగత అకౌంట్‌లోకి వెళ్ళిపోతుంది. చివరకు మీ చేతిలో ఏమాత్రం విలువ లేని వస్తువులతో కూడిన డబ్బా మాత్రమే మిగులుతుంది.

2. అధిక విలువ గల “ముందస్తు పేమెంట్” డీల్స్

మోసగాళ్లు అధిక విలువ కలిగిన వస్తువులను నమ్మశక్యం కాని భారీ డిస్కౌంట్లకు లిస్ట్ చేస్తారు. దీనితో ఆశపడిన కొనుగోలుదారులు ప్రీ-పెయిడ్ లేదా క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో పెద్ద మొత్తంలో ఆర్డర్లు చేసేలా ఒప్పిస్తారు. కానీ ఆ ప్యాకేజీలో కేవలం పనికిరాని చెత్త మాత్రమే ఉంటుంది, ఒక్కసారి డబ్బు చేతికి అందగానే ఆ విక్రేత ఎలాంటి ఆనవాళ్లు లేకుండా మాయమైపోతాడు.

COD మోసాలను గుర్తించడం ఎలా? గమనించాల్సిన కొన్ని సందర్భాలు!


సందర్భం 1: ఆర్డర్ చేయకుండానే వచ్చే COD ఉచ్చు

సీమా ఆఫీసు పనిలో బిజీగా ఉన్న సమయంలో, ఒక డెలివరీ ఏజెంట్ ఆమె ఇంటికి వస్తాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె తల్లి తలుపు తీస్తుంది. షిప్పింగ్ లేబుల్‌పై సీమా పేరు, ఫోన్ నంబర్ మరియు అడ్రెస్ కచ్చితంగా ముద్రించి ఉండటం చూసి, సీమానే ఆ ఆర్డర్ పెట్టి ఉంటుందని ఆమె తల్లి భావించి, UPI ద్వారా ₹800 చెల్లించి ఆ పార్శిల్‌ను తీసుకుంటుంది. తర్వాత సీమాకు ఈ విషయం తెలిసి, తన ఆర్డర్ హిస్టరీని చెక్ చేసుకోగా తను అసలు ఏమీ కొనుగోలు చేయలేదని నిర్ధారించుకుంటుంది. ఆ ప్యాకేజీని తెరిచి చూడగా, అందులో నాసిరకం, గడువు తీరిన కాస్మెటిక్స్ కనిపిస్తాయి.

సందర్భం 2: అసలు ఆర్డర్‌ను దారి మళ్లించే మోసం

తరచుగా ఆన్‌లైన్ షాపింగ్ చేసే ఆర్తి, తనకు అంతగా పరిచయం లేని ఒక ఇ-కామర్స్ వెబ్‌సైట్ నుండి కొన్ని వస్తువులను కొనుగోలు చేసి క్యాష్ ఆన్ డెలివరీ (COD) ఎంచుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత, ఆమె ఆఫీసులో ఉన్నప్పుడు “అవుట్ ఫర్ డెలివరీ” నోటిఫికేషన్‌తో పాటు ఒక అపరిచిత కొరియర్ సర్వీస్ నుండి ఫోన్ కాల్ వస్తుంది. ముందే పేమెంట్ చేసే అలవాటున్న ఆమె, UPI QR కోడ్ పంపమని ఏజెంట్‌ను అడిగి, ఆన్‌లైన్‌లోనే పేమెంట్ పూర్తి చేసి, ప్యాకేజీని బిల్డింగ్ సెక్యూరిటీ దగ్గర ఇవ్వమని చెప్పింది. ఆ సాయంత్రం ఇంటికి వచ్చి బాక్స్ తెరిచి చూడగా, అందులో ఎలాంటి ఆర్డర్ ఇన్‌వాయిస్ లేకుండా పనికిరాని వస్తువులు ఉంటాయి. ఆమె షాపింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అయి చూస్తే, తన అసలు ఆర్డర్ ఇంకా రవాణాలోనే ఉందని తెలుస్తుంది. ఆమె షిప్పింగ్ వివరాలు లీక్ అవ్వడం లేదా దుర్వినియోగం కావడం వల్ల, అసలు ఆర్డర్ కంటే ముందే ఈ నకిలీ COD డెలివరీని పంపారని ఆమె గ్రహిస్తుంది.

వాస్తవ జీవితంలో దీని ప్రభావం ఎలా ఉంటుంది?

ఇలాంటి డెలివరీ మోసాల బారిన పడటం వల్ల కేవలం చిన్నపాటి ఆర్థిక నష్టం మాత్రమే కాదు, అంతకుమించిన పరిణామాలు ఉంటాయి. దీని ప్రభావం ప్రధానంగా మూడు రకాలుగా ఉంటుంది:

  • నేరుగా ఆర్థిక నష్టం: నాసిరకం నకిలీ వస్తువులు, ఖాళీ డబ్బాలు లేదా అసలు అందనే అందని డిజిటల్ సేవల కోసం మీరు కష్టపడి సంపాదించిన నగదును కోల్పోతారు.
  • అకౌంట్ భద్రతకు ముప్పు: మోసగాళ్ల మాయలో పడి మీరు ఏదైనా కాల్-ఫార్వార్డింగ్ కోడ్‌ను డయల్ చేసినా లేదా OTPని షేర్ చేసినా, వారు మీ ప్రధాన ఫోన్ నంబర్‌ను హైజాక్ చేయగలరు. తద్వారా మీ వాట్సాప్‌ను యాక్సెస్ చేసి, మీ బ్యాంకింగ్ యాప్‌లను తమ ఆధీనంలోకి తీసుకుని మరిన్ని మోసాలకు పాల్పడవచ్చు.
  • డిజిటల్ పేమెంట్లపై నమ్మకం సన్నగిల్లడం: సులభంగా ఛార్జ్‌బ్యాక్ పొందే వీలున్న క్రెడిట్ కార్డ్ లావాదేవీల మాదిరిగా కాకుండా, తక్షణ UPI పేమెంట్లు ఒకసారి జరిగితే తిరిగి వెనక్కి రావు. ఒక్కసారి మీ అకౌంట్ నుండి డబ్బు వెళ్ళిపోతే, దాన్ని తిరిగి పొందడం దాదాపు అసాధ్యం. ఇది డిజిటల్ పేమెంట్లు అందించాల్సిన సౌకర్యాన్ని మరియు మనశ్శాంతిని పూర్తిగా దెబ్బతీస్తుంది.

ఇలాంటి పరిస్థితులను నివారించడానికి, PhonePe వంటి ప్లాట్‌ఫామ్‌లు హై-రిస్క్ ట్యాగ్ ఉన్న నంబర్లు లేదా మర్చంట్ పేరులో తేడాలు ఉన్నప్పుడు భద్రతా హెచ్చరికలను చూపిస్తాయి. వినియోగదారులు లావాదేవీని పూర్తి చేసే ముందు కాస్త ఆగి, ఈ హెచ్చరికలను చదివినప్పుడే అవి సమర్థవంతంగా పనిచేస్తాయి.

మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మరియు ఒక అడుగు ముందుండటం ఎలా?

సురక్షితంగా ఉండటానికి మీరు ఆన్‌లైన్ షాపింగ్ సౌకర్యాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ డబ్బును మరియు డేటాను సురక్షితంగా ఉంచుకోవచ్చు.

  • కృత్రిమంగా సృష్టించే అత్యవసర పరిస్థితిని ఒక ప్రమాద సంకేతంగా భావించండి. డెలివరీ డ్రైవర్ లేదా “సపోర్ట్ ఏజెంట్” మీరు ఈ క్షణమే పేమెంట్ చేయాలని, లేకపోతే జరిమానా పడుతుందని ఒత్తిడి చేస్తే కాసేపు ఆగండి. మీ కంగారే మోసగాళ్ల అతిపెద్ద ఆయుధం.
  • షిప్పింగ్ సమాచారం కోసం ఎల్లప్పుడూ సంబంధిత వెబ్‌సైట్‌ను చెక్ చేయండి మరియు వెరిఫై అయిన మార్గాల ద్వారా మాత్రమే డెలివరీ స్టేటస్ నిర్ధారించుకోండి.
  • COD మెసేజ్‌లను నిర్లక్ష్యం చేయకండి. మీరు ఆర్డర్ చేయకపోయినా అలాంటి మెసేజ్ వస్తే వెంటనే రిపోర్ట్ చేయండి, ఎందుకంటే ఎవరైనా మీ సమాచారాన్ని దుర్వినియోగం చేసి ఉండవచ్చు.
  • COD ద్వారా చెల్లించే ముందు వస్తువును పరిశీలించండి. పార్శిల్ మీ చేతికి అంది, అందులోని వస్తువులను సరిచూసుకునే వరకు క్యాష్ ఆన్ డెలివరీ పేమెంట్ ఎప్పుడూ చేయకండి.
  • డబ్బు అందుకునే వారి పేరును సరిచూసుకోండి. “పే” బటన్ నొక్కే ముందు, కన్ఫర్మేషన్ స్క్రీన్‌పై డబ్బు అధికారికంగా నమోదైన కంపెనీకి వెళుతోందా లేక ఏదైనా గుర్తింపు లేని వ్యక్తి వ్యక్తిగత UPI ఐడికి వెళుతోందా అని నిర్ధారించుకోండి.
  • యాప్ వార్నింగ్స్‌పై దృష్టి పెట్టండి. ధృవీకరించబడని లేదా హై-రిస్క్ లబ్ధిదారుల గురించి యాప్‌లో వచ్చే సెక్యూరిటీ పాప్-అప్‌లను లేదా హెచ్చరికలను తేలికగా కొట్టిపారేయకండి. మీ బ్యాంకింగ్ యాప్ ఒక బలమైన కారణంతోనే మిమ్మల్ని అప్రమత్తం చేస్తోంది.
  • అధిక విలువ కలిగిన లావాదేవీలను విడిగా మరోసారి సరిచూసుకోండి. మీరు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తున్నట్లయితే, చాట్ విండో నుండి బయటకు వచ్చి, డబ్బు అందుకునే వారి వివరాలను మరియు అమౌంట్‌ని స్వయంగా మరోసారి చెక్ చేయండి.
  • తక్కువ ట్రస్ట్ స్కోర్ ఉన్న అపరిచిత వెబ్‌సైట్‌ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. వెబ్‌సైట్ పేరును సెర్చ్ చేయడం ద్వారా లేదా రివ్యూలు చదవడం ద్వారా దాని విశ్వసనీయతను తెలుసుకోవచ్చు.  

మీరు మోసానికి గురైతే ఏమి చేయాలి

మీరు ఏమైనా మోసానికి గురయ్యారని అనుమానం వస్తే, వెంటనే ఫిర్యాదు చేయండి. ప్రతి క్షణం చాలా విలువైనది.

PhonePeలో రిపోర్ట్ చేయడం:

  • PhonePe కస్టమర్ కేర్: 080-68727374 / 022-68727374 నంబర్లకు కాల్ చేయండి.
  • లాగిన్ స్థాయి సమస్యలు : https://support.phonepe.com/ ద్వారా టికెట్‌ను రైజ్ చేయండి
  • సోషల్ మీడియాలో రిపోర్ట్ చేయండి: 
  • ఫిర్యాదుల పరిష్కారం: PhonePe గ్రీవెన్స్ పోర్టల్‌లో ఫిర్యాదును ఫైల్ చేయండి.

అధికారులకు రిపోర్ట్ చేయడం:

  • సైబర్ క్రైమ్ సెల్: సైబర్ క్రైమ్ పోర్టల్​లో కంప్లైంట్ ఫైల్ చేయండి లేదా  1930కు కాల్ చేయండి.
  • టెలీకమ్యూనికేషన్స్ విభాగం (DOT): అనుమానాస్పద మెసేజ్‌లు, కాల్‌లు, లేదా WhatsApp, Telegram  మోసాల గురించి సంచార్ సాథీ పోర్టల్‌లోని ఛక్షు సౌకర్యం ద్వారా ఫిర్యాదు చేయండి.

ముఖ్యమైన రిమైండర్ — PhonePe ఎప్పుడూ గోప్యమైన లేదా వ్యక్తిగత వివరాలను అడగదు. phonepe.com డొమైన్ నుండి రాకపోతే, PhonePe నుండి వచ్చినట్లుగా చెప్పే అన్ని మెయిల్స్‌ను విస్మరించండి. మీరు మోసపోయారని భావిస్తే, దయచేసి వెంటనే అధికారులను సంప్రదించండి.

Keep Reading