
Trust & Safety
2027 జనాభా గణన మోసాల హెచ్చరిక: మీ గుర్తింపును ఎలా కాపాడుకోవాలి
PhonePe Regional|2 min read|24 June, 2026
ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి డిజిటల్ జనాభా గణన అయిన భారతదేశ 16వ జనాభా గణన ప్రస్తుతం కొనసాగుతోంది. ఇళ్ల జాబితా తయారీకి సంబంధించిన మొదటి దశ పూర్తవగా, ప్రతి పౌరుడి సామాజిక, జనాభా సంబంధిత మరియు ఆర్థిక సమాచారాన్ని సేకరించే జనాభా గణన రెండవ దశ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది.
దురదృష్టవశాత్తూ, ఈ కొన్ని నెలల్లో కేటుగాళ్లు అమాయకులను మోసం చేయడానికి 2027 జనాభా లెక్కలను ఒక సాధనంగా వాడుకుంటున్నట్లు గమనించడం జరిగింది. మోసగాళ్లు ప్రభుత్వ గణనాధికారులుగా నటిస్తూ, పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. కాబట్టి వ్యక్తిగత సమాచారాన్ని మరియు కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచుకోవడానికి ఇటువంటి నకిలీ గణనాధికారులను ఎలా గుర్తించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
జనాభా లెక్కల మోసగాళ్లు ఎలా మోసం చేస్తారు?
జనాభా లెక్కల మోసగాళ్లు ఆర్థిక దొంగతనాలు మరియు ఐడెంటిటీ ఫ్రాడ్ చేయడానికి ఈ జనాభా లెక్కల ప్రక్రియను ఒక మాధ్యమంగా వాడుకుంటారు. వారు ఉపయోగించే కొన్ని పద్ధతులు ఇక్కడ ఉన్నాయి:
- నకిలీ గుర్తింపు: మోసగాళ్లు ఇంటింటికీ వెళ్లడం, వాట్సాప్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా ప్రభుత్వ గణన అధికారులుగా నటిస్తారు. వారు ఆధార్, పాన్ మరియు బ్యాంకింగ్ వివరాల వంటి అత్యంత విలువైన సమాచారాన్ని సేకరించడానికి జనాభా లెక్కలను ఒక సాకుగా ఉపయోగించుకుంటారు. ఒకసారి సమాచారం దొరికిన తర్వాత, వారు మీ ఐడెంటిటీని నేరపూరిత కార్యకలాపాలలో దుర్వినియోగం చేస్తారు, ఇది భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులకు దారితీయవచ్చు. నకిలీ లోన్లు లేదా క్రెడిట్ కార్డుల కోసం “సింథటిక్ ఐడెంటిటీలను” సృష్టించడానికి కూడా వారు ఈ వ్యక్తిగత డేటాను ఉపయోగించవచ్చు.
- ఫిషింగ్ లింక్స్: జనాభా లెక్కల డేటాను అప్‌డేట్ చేయాలనే నెపంతో మోసగాళ్లు నకిలీ లింక్‌లతో కూడిన SMSలను పంపుతారు, కానీ అసలు ఉద్దేశం వ్యక్తిగత డేటాను దొంగిలించడమే. బ్యాంక్ అకౌంట్లు మరియు UPI వాలెట్లను ఖాళీ చేయడానికి వారు OTP లేదా QR కోడ్ స్కామ్‌లను కూడా ఉపయోగించవచ్చు.
- హానికరమైన యాప్‌లు: మోసగాళ్లు మీ ఫోన్‌లోని సమాచారాన్ని దొంగిలించడానికి లేదా మీరు నొక్కే కీలను, ప్రైవేట్ సందేశాలను ట్రాక్ చేయడానికి మీ డివైస్‌కి రిమోట్ యాక్సెస్ అందించేలా రూపొందించిన నకిలీ సెన్సస్ యాప్‌లను (APKలను) డౌన్‌లోడ్ చేసుకోమని పౌరులపై ఒత్తిడి చేస్తారు.
జనాభా లెక్కల అధికారులలా నటిస్తున్న మోసగాళ్లను ఎలా గుర్తించాలి
- నిజమైన అధికారులు ఎప్పుడూ OTPలు, CVV, పిన్‌లు లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్లను అడగరు.
- మీ ఆధార్ లేదా PAN కార్డ్ ఫోటోలు తీస్తామని వారు పట్టుబడితే జాగ్రత్తగా ఉండండి, అవి దుర్వినియోగం కావచ్చు.
- స్కామర్లు Gmail లేదా Yahoo ఇమెయిళ్లను మరియు ప్రభుత్వేతర వెబ్‌సైట్లను ఉపయోగిస్తారు. అధికారిక ప్రభుత్వ కమ్యూనికేషన్లు కేవలం .gov.in డొమైన్‌లను మాత్రమే ఉపయోగిస్తాయి.
- నిజమైన గణన అధికారులు ప్రభుత్వం జారీ చేసిన ఐడి కార్డు, అధికార ధృవీకరణ పత్రం కలిగి ఉంటారు మరియు ప్రభుత్వం అందించిన నిర్దిష్ట మొబైల్ డివైస్‌లను ఉపయోగిస్తారు.
- జనాభా లెక్కలు ఉచితం, “రిజిస్ట్రేషన్ ఫీజు” లేదా “కన్వీనియన్స్ ఛార్జీలు” కావాలని అడిగితే అది 100% మోసమని గ్రహించండి.
మీరు మోసపోతే ఏమి చేయాలి?
- మీ బ్యాంక్ అధికారిక యాప్ లేదా బ్రాంచ్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులు మరియు UPI యాక్సెస్‌ను వెంటనే ఫ్రీజ్ చేయండి.
- మీరు ఏదైనా అనుమానాస్పద యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఉంటే, స్పైవేర్/మాల్‌వేర్‌ను తొలగించడానికి ఫ్యాక్టరీ రీసెట్ చేయండి.
- మీ పొరుగువారిని వారు టార్గెట్ చేయకుండా నిరోధించడానికి, ఎవరైనా నకిలీ అధికారి మీ ఇంటికి స్వయంగా వస్తే మీ స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించండి.
ఎలా రిపోర్ట్ చేయాలి?
మీరు స్కామ్ బారిన పడ్డారని అనుమానిస్తే, వెంటనే రిపోర్ట్ చేయండి:
PhonePeలో రిపోర్ట్ చేయడం:
- PhonePe గ్రూప్ చాట్: ఒకవేళ ఈ గ్రూప్ మోసపూరితమైనదని మీకు అనుమానం వస్తే, గ్రూప్ ప్రొఫైల్ కింద ఉండే “ఎగ్జిట్” మరియు “రిపోర్ట్” ఆప్షన్‌పై క్లిక్ చేయవచ్చు.
- PhonePe యాప్: సహాయం విభాగానికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి.
- కస్టమర్ కేర్: PhonePeకు 80–68727374 లేదా 022–68727374 నంబర్లకు కాల్ చేయండి.
- సోషల్ మీడియాలో రిపోర్ట్ చేయండి:
- Twitter: PhonePe Support
- Facebook: PhonePe Official
- ఫిర్యాదుల పరిష్కారం: PhonePe గ్రీవెన్స్ పోర్టల్‌లో ఫిర్యాదును ఫైల్ చేయండి.
అధికారులకు రిపోర్ట్ చేయండి:
- సైబర్ క్రైమ్ సెల్: సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కంప్లైంట్ ఫైల్ చేయండి లేదా 1930కు కాల్ చేయండి.
- టెలీకమ్యూనికేషన్స్ విభాగం (DOT): అనుమానాస్పద మెసేజ్‌లు, కాల్‌లు, లేదా వాట్సాప్ మోసాల గురించి సంచార్ సాథీ పోర్టల్‌లోని ఛక్షు సౌకర్యం ద్వారా ఫిర్యాదు చేయండి.
ముఖ్యమైన రిమైండర్ — PhonePe ఎప్పుడూ గోప్యమైన లేదా వ్యక్తిగత వివరాలను అడగదు. phonepe.com డొమైన్ నుండి రాకపోతే, PhonePe నుండి వచ్చినట్లుగా చెప్పే అన్ని మెయిల్లను విస్మరించండి. మీకు మోసానికి గురైనట్టు అనుమానమైతే, దయచేసి వెంటనే అధికారులను సంప్రదించండి.
