PhonePe Blogs Main Featured Image

Trust & Safety

పంపించాలనుకున్నవారికి కాకుండా వేరే వారికి/తెలియనివారికి డబ్బు పంపించినప్పుడు లేదా పేమెంట్ పెండింగ్‌లో ఉన్నప్పుడు, ఆ UPI పేమెంట్‌లను రివర్స్ చెయ్యడం ఎలా?

PhonePe Regional|2 min read|28 December, 2023

URL copied to clipboard

పంపించాలనుకున్నవారికి కాకుండా వేరే వారికి/తెలియనివారికి మీరు డబ్బును పంపించినట్లయితే ఆ పేమెంట్‌ను రివర్స్ చెయ్యడం ఎలా అని ఎప్పుడైనా ఆలోచించారా? అనుకోకుండా తెలియని వ్యక్తికి డబ్బు పంపించేయడం సాధారణంగా జరుగుతుంటుంది. మీరు ఫోన్ నంబర్‌ను తప్పుగా ఎంటర్ చేసి ఉండవచ్చు, UPI IDని తప్పుగా టైప్ చేసి ఉండవచ్చు లేదా పంపించాలనుకున్న వ్యక్తి పేరు కాకుండా వేరే వ్యక్తి చాట్‌పై క్లిక్ చేసి ఉండవచ్చు. అయితే, పేమెంట్ తప్పుగా చేశామని అది పూర్తయ్యాకనే తెలుసుకోగలం! అటువంటి సందర్భాలలో లేదా పేమెంట్ పెండింగ్‌లో ఉన్నప్పుడు, ఈ బ్లాగ్‌లో వివరించిన విధానాన్ని అనుసరించి మీ పేమెంట్‌ను తిరిగి పొందవచ్చు.

తప్పుగా నగదు బదిలీ/మనీ ట్రాన్స్‌ఫర్ చెయ్యడం అంటే ఏమిటి?

మీరు పంపాలనుకున్న వ్యక్తికి బదులుగా వేరే వ్యక్తికి డబ్బును పంపించినప్పుడు, దాన్ని తప్పుడు లేదా సరిగ్గా చెయ్యని నగదు బదిలీగా పరిగణిస్తారు.

మీరు తప్పుగా నగదు బదిలీ చేసినప్పుడు ఏం చెయ్యాలి?

UPI పద్ధతిలో పేమెంట్ చేసినప్పుడు పంపించిన వ్యక్తి ఖాతాలోకి నేరుగా డబ్బు జమ అవుతుంది. కాబట్టి, ఆ పేమెంట్‌ను రివర్స్ చెయ్యడం కాస్త కష్టమైన పని. UPI పేమెంట్‌లను రద్దు చెయ్యడానికి లేదా రివర్స్ చెయ్యడానికి బ్యాంకులు మాకు అనుమతి ఇవ్వవు. డబ్బును తిరిగి మీ ఖాతాలోకి తీసుకురావాలంటే, ఆ డబ్బు పొందిన వ్యక్తి, ఆ మొత్తాన్ని వెనక్కి పంపించేందుకు తన బ్యాంకుకు ఖచ్చితంగా అనుమతి ఇవ్వాలి.

అలా మనం పంపిన డబ్బును పొందిన వ్యక్తి మన కుటుంబసభ్యులు లేదా స్నేహితులు అయితే, ఆ డబ్బును తిరిగి పొందడం చాలా సులభం. అయితే మీరు తప్పుగా నగదు బదిలీ చేసిన తరువాత, ఆ డబ్బును తిరిగి పొందలేకపోతే, ఈ కిందన వివరించిన దశలను అనుసరించండి:

  1. నేరుగా మీ బ్యాంక్‌ను సంప్రదించండి. పేమెంట్ ప్రత్యేక లావాదేవీ సూచన (UTR) నంబర్‌ను సమర్పించి తప్పుగా పంపిన క్రెడిట్ ఛార్జ్‌బ్యాక్‌ను అభ్యర్థించండి.
  2. ఒకవేళ మీరు తప్పుగా డబ్బు పంపిన వ్యక్తికి మీ బ్యాంక్‌లోనే ఖాతా ఉన్నట్లయితే, మీ తరపున మీ బ్యాంక్ వారిని నేరుగా సంప్రదించి, డబ్బును మీకు తిరిగి ఇవ్వమని అభ్యర్థించవచ్చు.
  3. ఒకవేళ మీరు తప్పుగా డబ్బు పంపిన వ్యక్తికి మరొక బ్యాంక్‌లో ఖాతా ఉన్నట్లయితే, ఈ సందర్భంలో మీ బ్యాంక్ కేవలం ఫెసిలిటేటర్‌గా మాత్రమే పని చేస్తుంది. ఆ బ్రాంచ్‌కు సంబంధించిన కొన్ని వివరాలను మీకు అందిస్తుంది. తదుపరి సహాయం కోసం మీరు బ్రాంచ్‌ను సందర్శించి మేనేజర్‌తో మాట్లాడాలి.
  4. డబ్బు పొందిన వ్యక్తి అంగీకరించినప్పుడు మాత్రమే మీ డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. వారు అలా చేస్తే, డబ్బు 7 రోజుల్లో మీ ఖాతాలో జమ అవుతుంది.
  5. రిసీవర్ మీ అభ్యర్థనకు ప్రతిస్పందించకపోతే లేదా బ్యాంక్ ఆ మొత్తాన్ని తిరిగి పొందలేకపోతే, మీరు NPCI పోర్టల్ (https://npci.org.in/ )లో ఫిర్యాదు చెయ్యవచ్చు.
  6. పైన పేర్కొన్న ప్రక్రియలను అనుసరించిన తర్వాత కూడా మీ ఫిర్యాదు పరిష్కారం కాకపోతే, 30 రోజుల తర్వాత మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించి, ఎస్కలేట్ చెయ్యవచ్చు.

పెండింగ్ లావాదేవీ అంటే ఏమిటి?

మీ ఖాతాలోని డబ్బు డెబిట్ అయ్యాక కూడా పేమెంట్ పూర్తి కాకపోతే దాన్ని పెండింగ్ లావాదేవీ అని అంటారు. ఇది అనేక రూపాల్లో జరగవచ్చు — మీరు పేమెంట్ చేసినప్పుడు మీ ఖాతాలోని డబ్బు డెబిట్ అవుతుంది. కానీ మీరు ఎవరికైతే డబ్బు పంపించారో వారి ఖాతాలో ఆ మొత్తం జమ కాదు. పేమెంట్ పెండింగ్‌లో ఉంటుంది లేదా మీ పేమెంట్ రద్దు అవుతుంది. కానీ, మీ ఖాతా నుంచి డెబిట్ అయ్యిన డబ్బు తిరిగి రాదు.

మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్‌లో ఉంటే ఏం చెయ్యాలి?

  1. దయచేసి ఓపిక పట్టండి. ఈ సందర్భంలో, మీ డబ్బు సురక్షితంగా, భద్రంగానే ఉంటుంది. త్వరలోనే మీ ఖాతాలోకి డబ్బు జమ అవుతుంది.
  2. మీ సమస్యను PhonePe యాప్‌లో మాకు చెప్పవచ్చు, దాన్ని మేము ట్రాక్ చేస్తూ ఉంటాం.
  3. పేమెంట్ స్టేటస్‌ను మీ బ్యాంక్ అప్‌డేట్ చెయ్యడానికి 48 గంటలు పడుతుంది. అప్పటివరకూ మీరు ఎదురు చూడాల్సి ఉంటుంది. మీ తరపున పేమెంట్ విజయవంతమై, మీ ఖాతాలో డబ్బు డెబిట్ అయితే, ఆ మొత్తం రిసీవర్ ఖాతాలో జమ అవుతుంది.
  4. పేమెంట్‌ విఫలమైతే, పేమెంట్‌ తేదీ నుండి 3–5 పనిదినాలలో ఆ మొత్తం మీ ఖాతాలో తిరిగి జమ అవుతుంది.
  5. వేగవంతమైన పరిష్కారం కోసం, మీరు ఎప్పుడైనా మీ బ్యాంక్‌ను సంప్రదించవచ్చు. ఫిర్యాదు చేసేందుకు లావాదేవీకి సంబంధించిన UTR నంబర్‌ను తెలపాల్సి ఉంటుంది.
  6. నిర్ణీత సమయం పూర్తయిన తర్వాత, మీరు ఎప్పుడైనా PhonePe యాప్‌లో ఈ విషయాన్ని ఎస్కలేట్ చెయ్యవచ్చు. దీంతో మీ సమస్యను పరిష్కరించడంలో, లావాదేవీపై తగిన చర్య తీసుకోవడంలో మేము సహాయపడతాము.

ముఖ్యమైన గమనిక: PhonePe ఎప్పుడూ మీ రహస్యాలను లేదా వ్యక్తిగత వివరాలను అడగదు. Phonepe.com డొమైన్ నుంచి మాత్రమే PhonePe మెయిల్స్‌ను పంపుతుంది. ఆ డొమైన్ లేకుండా PhonePe నుండి పంపించినట్లుగా ఉన్న ఇతర మెయిల్స్‌ను పట్టించుకోవద్దు. మోసం చేస్తున్నారనే అనుమానం మీకు కలిగినట్లయితే, దయచేసి వెంటనే మీ బ్యాంకును సంప్రదించి సమాచారమివ్వండి.

మా కస్టమర్ ప్రతినిధి మీ క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాలను లేదా OTPని షేర్ చెయ్యండని మిమ్మల్ని ఎప్పటికీ అడగరు. వారు మిమ్మల్ని అధీకృత ల్యాండ్‌లైన్ నంబర్‌ల నుండి మాత్రమే సంప్రదిస్తారు. మొబైల్ నంబర్ నుండి అస్సలు ఫోన్ చెయ్యరు. మీ బ్యాంక్ డొమైన్‌ లేని ఈమెయిల్స్‌ను పట్టించుకోవద్దు. సోషల్ ఇంజనీరింగ్ మోసం జరిగే అవకాశముంది. జాగ్రత్తగా ఉండండి.

మీ సమస్యను తెలియజేయడం కోసం, PhonePe యాప్‌లోకి లాగిన్ అయ్యి, ‘Help/సహాయం’కు వెళ్లండి. మోసానికి సంబంధించిన ఘటనను ఖాతా భద్రతా సమస్య/ మోసపూరిత కార్యాచరణను తెలియజేయండి’ విభాగం కింద తెలపవచ్చు. అదే కాకుండా, support.phonepe.comకు లాగిన్ అవ్వవచ్చు లేదా Twitterలో కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు.

Keep Reading